
మెదక్ జిల్లాలోని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు..తమ భూములను ఈటల ఆక్రమించాడని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతి నిరోధక, విజిలెన్స్ శాఖలు రంగంలోకి దిగాయి. అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఈటల రాజేందర్ హేచరీలతో పాటు పక్క భూముల్లో సర్వే నిర్వహించారు. సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
నేడు అచ్చంపేట గ్రామ పరిధిలోని 130 సర్వే నెంబర్ లోని భూములను..17వ తేది ఇదే గ్రామంలోని 77 నుంచి 82 సర్వే నెంబర్ల వరకు ఉన్న భూములను సర్వే చేస్తారు. 18వ తేది హకీంపేట గ్రామం పరిధిలోని 97 సర్వే నెంబర్ లోని భూములను సర్వే చేయనున్నారు. తూప్రాన్ డివిజన్ ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబ సభ్యులతో పాటు మరో 154 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సర్వే నేటి నుంచి మూడు రోజుల పాటు సాగనుంది.
గతంలో అధికారుల తీరుపై ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సర్వే జరిగిందని, నివేదిక లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు, తగు సమయం ఇచ్చి.. సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో జూన్ మూడో వారంలో పునఃసర్వేకు అధికారులు సిద్ధం కాగా.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తాత్కాలికంగా వాయిదా వేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు భూముల సర్వేకు సన్నద్ధం అయ్యారు.