
ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ బాగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో వెబ్ సిరీస్ పై జనాలు ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు, హీరోలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య… విక్రమ్ దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో చైతన్య విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని చైతన్య స్వయంగా తెలిపాడు.
‘విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేశాను. అయితే ఆయన చెప్పిన కథ థియేట్రికల్ రిలీజ్‌కి సరిపోదు. అందుకే దీన్ని వెబ్‌సిరీస్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు…’ నాగచైతన్య తెలిపాడు. ఇకపై మరిన్ని ఓటీటీ సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తానని ప్రకటించాడు. అభిమానులకు కొత్తగా అనిపించేలా ఉంటే ఎలాంటి ప్రయోగం చేసేందుకైనా సిద్ధమని చెప్పాడు. తన తండ్రి నాగార్జున, తాత నాగేశ్వరరావు కూడా ఇలా ప్రయోగాలు చేసే ప్రేక్షకులకు చేరువ అయ్యారని గుర్తుచేశాడు.
ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న చాలా మంది హీరోలు విలన్ నుండి కథానాయకులుగా మారిన వారే. ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా అలరిస్తున్నాడు. దగ్గుబాటి హీరో రానా కూడా విలన్‌గా నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పటికే బాహుబలి సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన రానా.. భీమ్లా నాయక్ కోసం కూడా విలన్‌గా మారాడు. ఇందులో డానియల్ శేఖర్ అనే నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా అంతే. ఈ జాబితాలో మరో హీరో చేరబోతున్నాడన్న మాట.