
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ మరో సారి ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలైతే దళిత బంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం సీటు కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, నిరుద్యోగుల కోసమే ప్రశ్నించానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా కాకపోయినా మనిషిగా చూడాలని అడిగానని తెలిపారు. అందుకే తన భూములు లాక్కొని, తనపై నిందలు వేశారని ఆరోపించారు. అప్పుడేమో భూములు ఆక్రమించుకున్నానని చెప్పి.. ఇప్పుడేమో సీఎం సీటు అడిగానని చెబుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ వారిని ప్రశ్నించే వారు లేరని విర్రవీగుతున్నారని మండిపడ్డారు.
ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్లో ఎంట్రీ దొరికిందన్నారు. తనతో ఉన్న నేతలను కొనుగోలు చేసేందుకు ఇక్కడే తిష్ట వేసిన మంత్రి ఆరాటపడుతున్నారని అన్నారు. మోకాళ్లతో నడిచినా, మోచేతులతో అంబాడినా హుజూరాబాద్ ప్రజలను ఎవరూ కొనలేరని వ్యాఖ్యానించారు. ‘‘మీ బిడ్డగా వస్తున్న నన్ను ఆదరిస్తారో..? లేక కేసీఆర్ మాటలు నమ్మి కత్తితో పొడుస్తారో? ఆలోచించుకోండి’’ అని సూచించారు. తనకు మద్దతిస్తున్నఅన్నలు, అక్కలు, పెద్దలకు తలవంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.