
సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘దృశ్యం 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నరేష్, నదియా, కృతిక, ఎస్తేర్, సంపత్ రాజ్, వినయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ వెర్షన్ కూడా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోనే విడుదలవుతోంది. నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో దృశ్యం-2 మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువస్తారు పోలీసులు. ఇక దృశ్యం 2 ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో సాగిపోయింది.