
తెలంగాణలో వైట్ ఛాలెంజ్ హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఏ సవాల్ కైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాదయాత్రలో భాగంగా తాడ్వాయిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఛాలెంజ్ లు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతామంటున్నారని.. తనపై కేసు పెట్టి చూడాలి అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చి అన్నీ బంద్ చేశారని సంజయ్ ఆరోపించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు జీతాలు ఎందుకు పెంచలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామయాత్ర తరువాత ఎక్కడికైనా వస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2లోపు పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన వైట్ ఛాలెంజ్ ఇప్పుడు బండి సంజయ్ వద్ద ఆగింది. డ్రగ్స్ వాడకూడదని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు ముందుగా టెస్టులు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై స్పందించిన కొండా… రక్త పరీక్షల కోసం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు సోమవారం వచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం రాహుల్ గాంధీ డ్రగ్స్ టెస్టుకు రెడీ అయితే తానూ రెడీ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు కేటీఆర్.