
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పాపం ఏమీ లేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వారు మాదకద్రవ్యాలు కూడా ఎప్పుడూ తీసుకోలేదని స్పష్టం చేసింది. డ్రగ్స్ పాపమంతా కెల్విన్ దేనని పేర్కొంది. కెల్విన్ తప్పుడు సమాచారం ఇచ్చి అందరినీ తప్పు దోవ పట్టించాడని తెలిపింది. సినీ ప్రముఖులు ఎవరూ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు కానీ, కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు గానీ తమకు ఆధారాలు లభించలేదని వివరించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. డ్రగ్స్ కేసులో కెల్విన్ తోపాటు నిఖిత్ శెట్టి, రవికిరణ్ మాత్రమే నిందితులని వెల్లడించింది.
మాదక ద్రవ్యాల సరఫరాలో ప్రధాన సూత్రధారిగా ఉన్న కెల్విన్ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ ఊబిలోకి దిగినట్టు అఫిడవిట్ లో సిట్ పేర్కొంది. విశ్వసనీయ సమాచారం మేరకు 2017 జూలై 2న నిర్వహించిన తనిఖీల్లో డ్రై గంజాయితోపాటు ఎమ్డీఎం, ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సినీ తారలకు డ్రగ్స్ సరఫరా చేశానంటూ కెల్విన్ చెప్పిన మాట.. అబద్ధమేనని తమ విచారణలో తేలినట్లు వెల్లడించింది. గతంలో కెల్విన్ చెప్పిన వివరాల ఆధారంగా 10 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తోపాటు అగ్ర నటులు ఉన్నారు. అయితే, స్వచ్ఛందంగా పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టుకు అంగీకరించారని, వారి నమూనాల్లో ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తాజా అఫిడవిట్లో సిట్ వివరించింది. అయితే, ఈడీ విచారణ జరుపుతున్న వేళ సిట్ సమర్పించిన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అప్పట్లో విచారించిన 10 మందితోపాటు సినీ నటులు రానా, రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.