
ఈ మధ్య ఎందుకో *అమ్మ* మామధ్య ఎక్కువగా ఉండడం లేదు..!
ఏమైందో ఏమో అడుగుదామన్నా ..
మాకు తీరికగా సమాధానం చెప్పేటంత సమయం అమ్మ దగ్గర కనపడడం లేదు..!
అమ్మ కాలచక్రంలో మార్పు స్పష్టంగా కనపడుతుంది..!
మబ్బుల్నే …
గుడి మీద వినవచ్చే *భూమయ్య* *పాటతో* పోటీపడి నిద్రలేసి..
మళ్లీ ఆయనపాట అయిపోయినాంక చాలా సేపటికి నిద్రపోతుంది..!
అంటే మేము నిద్ర లేవకముందే .. గుడికి పోయిరావడం.. ఇంట్లో పూజతో పాటు.. ఇంటిపనంతా ముగించేస్తుంది..!
ఇదివరకు మధ్యాహ్నం భోజనానికి బడినుండి మేము వచ్చేవరకూ ఎదురు చూసేది..!
కానీ ఈమధ్య అన్ని అక్కడ పెట్టేసి మీరే వడ్డించుకొని తినండి అని చెప్పి.. ఆ సమయంలో ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళి పోతుంది..!
అలా కొద్ది రోజులు గడిచిపోయాయి.. !
బతుకమ్మ పండగకు ముందు వచ్చే బొడ్డెమ్మల పండగనాడు అమ్మకొత్త అవతారం ఎత్తింది…!
అంతకుముందు ఎప్పట్నుండో వాడకుండా పడిఉన్న కుట్టుమిషన్ ను శుభ్రం చేసి.. దర్జీఅవతారం ఎత్తింది..!
బాబిన్ డబ్బా ఏదో..
దారం ఎలా ఎక్కించాలో..
ఎలా తొక్కాలో కూడా తెలియని అమ్మ చకచకా తనకిష్టమైన పోకరంగు పట్టుచీర ముక్కలు చేసింది..!
మొదటగా ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలకు వస్త్రాలను కుట్టి.. కళ్లకద్దుకొని పక్కకుపెట్టి మరీ నన్ను దగ్గరికి రమ్మని పిలిచింది..!!
ఆ మిగిలిన చీరతోనే నాకూ పట్టులంగా కుట్టడానికి
జాగ్రత్తగా కొలతలు తీసుకొని రాసుకొంది..!
“ఏందే అమ్మా ఇది” అని అడగంగనే ..
“నీకేనే….. బతుకమ్మ పండగకు పట్టులంగా కుడుదామని” అంది ..!
ఆ కలర్ నాకేం వద్దు .. నాకు గులాబి రంగైతేనే కుట్టు” అనంగనే అమ్మ మొఖం చిన్నగైంది..!
మళ్లీ ఏమనుకుందో ఏమో ..
“నీకు ఈ కలర్ కూడా మంచిగుంటదే.. అసలే నేను ధైర్యంగా కుట్టడం ఇదే మొదటిసారి.. కుదురుతదో లేదో చూద్దాం..!
“దేవుని దయతోటి కుదిరిందనుకో.. గులాబీ రంగు బట్టనే తెచ్చి కుడుతా” అని సముదాయిస్తుంటే అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టింది అమ్మమ్మ…!
“ఏందే కొత్తగ మిషన్ మీద బట్టలు కుడుతున్నవ్.. ఎప్పుడు నేర్చినవే ?
అమ్మ వాలకాన్ని చూస్తూ కళ్లెగరేసింది అమ్మమ్మ..!
“మూడు నెలలైతుంది.. రోజూ కమలమ్మ దగ్గరికి పోయి నేర్చకోబట్టి” మాట గర్వంగా దొర్లింది…
“ఇంట్ల చాకిరీ.. పోరగాండ్లు.. నీ గుడీ పూజా ఇన్నిట్లల్ల …. నీతోని అయితదా… కమలమ్మకే ఇస్తే కుడుతదిగదనే..” అమ్మమ్మ కడుపు తీపితో అంది…
“పనెక్కువైతదన్న నీ ఆరాటం కరెక్టేనే ..
దీన్ని కొని రెండేండ్లు అయింది…
కొన్ననాడు కొబ్బరికాయ
కొట్టుడు తప్ప కుట్టుడు కానే గాలే ..
అనవసరంగా కొన్నమేమో అనిపిచ్చింది.. .
కానీ పోయినేటి సంఘటన నన్ను ఆలోచనలో పడేసిందే అమ్మా ” అని అసలేం జరిగిందో చెప్పింది…..
నిరుడు బతుకమ్మ పండుగకు దీనికి ఓ ఫ్రాక్ కొందామని బట్టల దుకాండ్లకు పోతే నిండ జనమే ఉన్నరు..!
కొంచెంసేపు ఆగుదామని చూస్తున్న…. ఇంతలో
ఎవరో మన పిల్లను దగ్గరికి తీసుకుని ..
వాళ్ళ పాపకు పట్టులంగా బట్ట తీసుకొని ఎలా ఉంటుందో దీని మీద సోరి చూసుకుంటున్నరు…! వాళ్ల పాప దీని పోలికలతో ఉంటదట..
వెనుకకు నిలబడ్డ నాకు ఆ పట్టు లంగా బట్ట దీని ఒంటిపై చూసినాంక అది అమ్మవారు లాగనే కనపడ్డదే..!
ఆ ఆనందంలో మురిసిపోయి కొందామనుకున్నా.. అంత డబ్బు సమయానికి లేక పాలిస్టర్ ఫ్రాక్ లు చూస్తుంటే.. వాళ్ల చూపులన్ని దాని మీదనే ఉన్నయ్..!
కొంచెం ఉన్నోళ్లేమో.. వాళ్ల సెలెక్షన్ కాంగనే..
దీన్ని పట్టించు కోక దూరం జరుపుతుంటే. నాకు కోపం వచ్చింది..!
ఆ కోపమే పట్టుదలను పెంచి ఇలా కుట్టు నేర్చుకునేలా చేసింది” అని.. మిషన్ తొక్కుతూ వివరంగా చెప్పింది అమ్మ..!
***
ఏడాదికింద అమ్మతో చెరువు గట్టుమీదకు వెళ్లి కోలాటం చూడడం అదే మొదలు..!
స్కూలూ .. ఇల్లు తప్ప వేరే ధ్యాసలేని నాకు బయటి ప్రపంచాన్ని చూడడం..
అమ్మను విడిచిదూరంగా ఆడుకోవడం..
భయం లేకుండా తిరగడం ..
గుడికి పోవడం అప్పుడే అలవడ్డాయి..!
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ రెండో రోజు…
నిన్న అయిష్టంగా నేపోయినా.. అక్కడి వాతావరణం చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది…!
అయినా ఇవాళ చెరువుకట్ట మీదికి పోవాలంటేనే ఈ రోజు మళ్లీ ఏం జరుగుతదోనని భయమేస్తుంది… !
“ఏమైందే ఇవాళ డల్ గా ఉన్నవ్..
కొత్త పట్టు లంగా వేసుకొని గుడి మీదికి పో ” అమ్మ అరుస్తుంది వంటింట్లోంచి..
ఇవాళ నేను పోను.. ” అన్నా..!
“నిన్నంత మంచిగనే పోయినవ్ గదనే
నిన్న నీకు తగిలింది చిన్న దెబ్బనే.. తగ్గిపోయింది కూడా చూడు” అని మెల్లగా నచ్చ చెబుతుంది అమ్మ..!
*పట్టులంగా* కలర్ నచ్చలేదన్న మంకుతో పోతలేనని అమ్మ అనుమానం…! అనుమానం ఏంది నిజమే కదా . అమ్మకు నా మనసులొ ఉన్నది ఎట్లా తెలుస్తోంది అనుకున్నా..
నిన్న ఏం జరిగిందో అసలు విషయం అమ్మకు చెప్తే .. !
ఆ ఆలోచనే నాలో కొంత భయాన్ని తగ్గించింది…!
***
నిన్న
సాయంత్రం చెరువుకట్టపై బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ కోలలతో ఆడుతూ ..
” *కుప్పి కుచ్చుల జడలు వేయవే* … *ఓయమ్మ నాకు..* **కూర్మావతారుడానవే* …..!
*కుప్పి కుచ్చుల జడలు వేసెదా* ..* *ఓయమ్మ నీకు ..*
*కూర్మావతారుడానెదా* …! “
వినోదత్త పాట చెప్తుంటే ..
చుట్టు ఉన్న ఆడవాళ్లందరూ క్రమబద్దంగా ఆడుతూ లయబద్దంగా పాడుతుంటే గద్దెపై కూర్చొని చూస్తున్న నేనూ వారితో గొంతు కలుపుతున్నాను…!
అక్కడి వాతావరణం నచ్చి
ఆ కోలపాటలలో లీనమై పాడుతున్న నావైపు కొందరు మెచ్చుకోలుగా చూస్తున్నా నాకు నచ్చని కలర్ లో ఉన్న *పట్టులంగాను* చూసుకుంటే నాకే చిరాకు వేసింది. .. !
అలా కూర్చొన్న కొద్దిసేపటికే చీకటయ్యింది.. అప్పటికే కొంతమంది వాళ్ళ బతుకమ్మలను చెరువులో వేసి ఇంటిమొకం పట్టారు..!
నేనూ ఇంటికి పోదామని గద్దె దిగంగనే కాలుకు ఏదో గుచ్చుకొని నొప్పి పెట్టింది..!
కుచ్చింది ఏంటిదా అని వంగి చూస్తే *జడ కుప్పి.* ..!
చీకట్లో కూడా ధగధగా మెరిస్తుంది..!
ఎవరిదో పాపం పడేసుకున్నరు..!
దాన్ని చేతులోకి తీసుకొని కుచ్చిన దగ్గర చేతితో రాసుకుంటూ.. పోగొట్టుకున్నవాళ్లు వెతుక్కుంటూ వస్తే ఇద్దామని అక్కడే కూర్చున్న..!
ఎవరిదో అడిగి మరీ ఇద్దామనుకుంటే చీకట్లో కొట్టి గుంజుకపోతారేమోనని భయం….
ఎవరినీ అడగాలో ..
అడిగితే ఏమంటరో .ఏమో.. ఏం చెయ్యాలో తెలియదు..!
చిన్నగా వర్షం…
తోడుగా.. కరెంట్ కూడా పోయింది..!
అప్పటికే తెలిసిన వాళ్లందరూ అక్కన్నుంచి వెళ్లిపోయారు..!
నేను కూడా దాన్ని భద్రంగా పట్టుకొని ఇంటికి తొందరగా ఉరుకుతుంటే .. కట్టకాల్వ మీద తడిసిన లంగా కాళ్లకు అడ్డుపడి కిందపడేలా చేసింది..! మోకాలికి దెబ్బ తగిలి ఒరుసుకపోయి చాలా నొప్పి పెట్టింది..!
జడ కుప్పి గుచ్చుకోవడం …
మోకాలికి దెబ్బతగలడానికి కారణం నాకు నచ్చని *పట్టులంగా* వేసుకోవడమని అనిపించిందీ.!
దాన్ని దాచిపెట్టాలో.. పడేయ్యాలో అర్థం కాలేదు..!
అమ్మకు చెప్తే.. అప్పుడు పారాయణంలో ఉంది కాబట్టి వినదు మరి ఏం చెయ్యాలో అర్థం కాక గూట్లో పడేసిన..!
కొంచెం సేపు అయినాంక అమ్మ నా దెబ్బను చూసి.. చుట్టూ సున్నం రాసింది..! దగ్గరుండి అన్నం తినిపిచ్చి నిద్రపుచ్చింది..!
***
అమ్మ ఈ రోజు కూడా కోలలాటకు పొమ్మని బలవంతం చేస్తుంటే …
నిన్న ఏం జరిగిందో చెప్పి
గూట్లో పెట్టిన ఆ కుప్పిను అమ్మకు ఇచ్చి గుడి మీదికి నేను పోనని
ఖర ఖండిగా చెప్పిన…!
దాన్ని అటీటు చూసి
“అరె..ఇది బంగారుది.. ఎవరిదో ఏమో.. !
మాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నిజాయితీగా ఇవ్వు తల్లీ …
ఎవరి కష్టార్జితమో మాకు వద్దు .. ఎలాగైనా పాపం వాళ్లది వాళ్లకు దక్కేలా చూడు తల్లీ …” అని అమ్మవారికి మొక్కింది అమ్మ ..!
మర్నాడు రాత్రి ఇంటిముందు గద్దెలపై ఆడుతుంటే …. మా ఇంటి సందు చివర్ల ఉండే యాదరాజేశం సేటు నలుగురు కోడళ్లు గుడి నుంచి ఇంటికి పోతుంటే వాళ్లను వెనుక నుంచి చూసిన నాకు అనుమానం వచ్చింది..!
వాళ్లలో ముగ్గురికి మాత్రమే జడ కుప్పిలు కనపడుతున్నయ్…!
అవి కూడా నిన్న నాకు దొరికిన దానిలా ఒకే రకంగా ఉండడం..
ఒకరికి అసలు జడ కుప్పి లేకపోవడంతో అది వాళ్లదేమోనన్న అనుమానం వచ్చింది….!
పిలిచి అడుగుదామనుకున్నా..
ఏదో భయం…. ఈ విషయం అమ్మకు చెప్పాలని ఇంట్లకు ఉరికిన…!
విషయం విన్న అమ్మ.. “వాళ్ల సొమ్ము మనకెందుకు అడిగి ఇచ్చి వస్తా ” అని కవర్లో దాన్ని పెట్టుకొని వాళ్లింటికి పోయింది…!
వస్తూ వస్తూ నన్ను దగ్గరికి తీసుకొని
“నిజంగనే వాళ్లదేనట.. జారిపడిపోయిందట” అని … ఏదో భారం దించుకున్న దానిలా ఫీలై నన్ను ముద్దాడింది..!
***
దుర్గాష్టమి నాడు పొద్దున్నే అమ్మ తలంటు స్నానం పోసింది…!
జుట్టు తడి తుడుస్తుంటే మాఇంటికి వచ్చింది ఆమె…!
ఆమెను చూస్తేనే మళ్లేమైందోనని గాబరా పడుతున్న అమ్మను చిరునవ్వుతో పలకరించింది..!
“అమ్మా …ఇవాళ దుర్గాష్టమి కదా..
కన్నె ముత్తైదువకు బొట్టు పెడదామని వచ్చినా అని నా కాళ్లకు పసుపు.. కళ్లకు కాటుక రాసి.. బొట్టుపెట్టి.. చిన్న దువ్వెన.. అద్దం …
ఇంకా ఏవేవో నాచేతుల పట్టనన్ని వస్తువులతో పాటు ..
ఇంకా తెరవని …. ఒక కవర్ నా చేతులపెట్టి..
నా పాదాలకు దండంపెట్టి మరీ.. వెళ్లిపోయింది యాద రాజేశం శేట్ కోడలు..!
ఆమె వెళ్లి పోయిన తర్వాత …
కవర్ విప్పి చూస్తే నాకు పట్టరాని సంతోషం కలిగింది….
ఎందుకంటే ……
అందులో ఉన్నది నాకు ఇష్టమైన గులాబీ రంగు *పట్టులంగా* బట్ట మరి….!
అదే ఆనందంలో అమ్మ వైపు చూశాను….. దాని ముఖం లో ఓ *అలౌకిక ఆనందపు మెరుపు* కనపడింది..!
కాకతాళీయమో ….కనికట్టో …
ఆ వయస్సులో అప్పుడు అది అర్థం కాలేదు..!
కానీ ….. ఇప్పుడు
ఎవరైనా చిన్న పిల్లలు పట్టులంగా వేసుకొని చుట్టూ తిరుగుతూ… ఆడుకుంటూ కనపడితే ఆనాటి సంగతులు కళ్ల ముందు కదలాడి…. అలానే చూస్తూ ఉండిపోతాను.. !
*నిజాయితిగా మసలుకున్నందుకు* *అమ్మ వారిచ్చిన బహుమతి అన్న* *అమ్మ సంతోషమూ..*
*అమ్మవారిపై అమ్మకున్న* *నమ్మకమూ కళ్లముందు* *కదలాడుతాయి కాబట్టి..!* 



అలా….
ఆనాటి _పట్టులంగా_ వెనక జరిగిన ఘటనను వివరించింది..
సతీదేవి &
నాగరాజా వాసాలమర్రి