
చిన్నమ్మాయి “సుధీరా భరద్వాజ్” పుట్టిన తర్వాత …..
మన వేములవాడ *రాజన్న* దర్శనమైన కొద్ది రోజులకు మా అత్తగారింటి ఆరాధ్య గురువు ” *రాఘవేంద్ర స్వామి* ” దర్శనం కోసం ….
టాటా సుమోలో “మంత్రాలయం” పోదామని …
జైపురి కాలనీ నుంచి బయల్దేరి…
దారి లో …. జడ్చర్ల డాబాల పక్కన ఆగేసరికి రాత్రి పదిన్నరైంది..!
వెంట తెచ్చుకున్న పులిహోర.. పెరుగన్నం పొట్లాల్లోంచి రెండు పొట్లాలు డ్రైవర్ కు కూడా తినడానికి ఇస్తే.. వాటిని తన సీట్లో పెట్టుకొని..
దాబా హోటల్ ముందరున్న STD బూత్ లోకి పరిగెత్తాడు..!
మా వంతు పులిహోర.. పెరుగన్నం రోడ్లపక్కనే కానిచ్చే సరికి పావుగంట గడిచినా .. డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతునే ఉన్నడు….!
ఈ మధ్యలో మా చిన్న బామ్మర్ది తనకు ఇష్టమైన పాటల సీడీ ఏదో కొని తెచ్చుకున్నడు..!
ఇంకో ఐదు నిమిషాల తర్వాత చేతులు నులుపుకుంటూ వచ్చి … “సారీ సార్.. లేటైందా.. వెళ్దామా” అన్నడు..!
“అదేంటి.. నువ్వు తినలేదుకదా.. ఫర్వాలేదు తిను..
తిన్న తర్వాతే బయల్దేరదాం..” అని నీళ్ల బాటిల్ ఇస్తుంటే..
“అయ్యో.. నేను తర్వాత తింటాను సార్ “
తనకిచ్చిన ప్యాకెట్లను పక్కకు జరిపి బండి స్టార్ట్ చేసిండు..!
ఏదో ఆందోళన కనపడుతుంది వాలకం చూస్తుంటే…!
గేర్ మార్చి ముందుకు పోనిచ్చినవాడు కాస్త…
మళ్లీ ఏం యాదికచ్చిందోగాని .. .. బ్రేక్ కొట్టి..
” సార్ మీ సెల్ నెంబరు ఇస్తరా..
మా ఇంట్లో వాళ్లకు ఇస్తాను … ప్లీజ్ సర్ “…. బ్రతిమిలాడిండు..!
సరే టెన్షన్లో ఉన్నడుకదా అని ఇస్తే ..
‘మావోల్లకూ ఈ నెంబర్ ఇచ్చి వస్తా “
అని బండి దిగి std వైపు పోతుంటే.. ఆపి
“బాబూ ఇది టాటా ఇండికామ్ రెండేండ్ల దాక అన్ లిమిటెడ్ .. దీన్నుంచే కాల్ చేసి చెప్పు ఫర్వాలేదు ” అనంగనే..
చిన్నగ నవ్వుకుంట ఫోన్‌చేసి చెప్పి …
బండి ముందుకు పోనిచ్చిండు . !
★★★
_దిల్ యే బేచేన్ హై… రస్తేపే నైన్ వే..
జిందరీ బేహాల్ హై.. సుర్ హై న తాల్ హై..
ఆజా సవారియా.. ఆ ఆ ఆ ఆ ..
తాల్ సె తాల్ మిలా .. ఓఓఓ.. తాల్ సె తాల్ మిలా.._
బామ్మర్ది కొన్న సీడీల పాటతో పాటే ప్రయాణం సాగుతుంటే డ్రైవర్ కు ఫోన్ రావడం.. పాట సౌండ్ తగ్గడంతో ఏడుపు మొదలు పెట్టింది సుధీరా..!
అప్పుడే కడుపు నిండా పాలు తాగింది ..
ఏమైందిరా అని చూస్తే ..
మా మోకాళ్లపై వేసుకున్న మెత్తటి సోఫా కుషన్ల మీద పడుకొని.. టాటా సుమో వెనుక విండోల నుంచి పున్నమి చంద్రున్ని చూస్తూ..
తాల్ సినిమా పాట అదీ ఎంజాయ్ చేస్తున్నట్టుంది..!
_“శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి_ ” అన్నట్టు
అందుకేనేమో పాట ఆగంగనే ఏడుపు మొదలు పెట్టింది..!
ఏమైందో అర్థం కాని భయపడ్డ డ్రైవర్.. మొకం చిన్నగ చేసుకొని.. సౌండ్ పెంచి .. బండి దిగి మరీ ఫోన్ల మాట్లాడుతుంటే.. మళ్లీ ఆ పాట వింటూ .. చంద్రున్ని చూసుకుంటు కిలకిల నవ్వింది..!
మరో గంట గడిచే సరికి ఇలాగే మూడు సార్లు జరిగింది..!
వెనకాల ఉన్న అందరికీ నిద్రముంచుకొచ్చి ఆవలింతలు వస్తుంటే ..
టెన్షన్తోబండి నడుపుతున్న డ్రైవర్ ఒకపక్కా..
నిద్ర పోకుండా చిరునవ్వులు చిందిస్తున్న సుధీరా ఇంకోపక్కా.. ఇద్దరినీ చూసి నిద్ర మూడ్ మాయమై అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది నాకు..!
ఎందుకైనా మంచిదని డ్రైవర్ పక్కసీటులో కూర్చొని ఏమైందని అడుగుదామనుకున్నా.. ఏమనుకుంటడో అని మానుకొన్న.. !
కాకపోతే అంత టెన్షన్లో కూడా అర్ధరాత్రిపూట ఎలాంటి పొరపాటు చేయకుండా డ్రైవింగ్ చేస్తుంటే చూసి మనసులోనే మెచ్చుకున్న..!
కొద్ది సేపటికి ఆటా పాటతో అలసిందేమో సుధీర నిద్రపోయింది.. దాంతోపాటు వెనుక కూర్చున్న వాళ్లందరూ కూడా నిద్రలోకి జారుకున్నారు..!
మధ్యలో రాయచూరులో చాయ్ తాగడానికి ఆగుదామనుకున్నా.. ఎక్కడా హోటల్లు తెరిచి ఉండక పోవడంతో అలాగే ముందుకు సాగి.. మంత్రాలయం చేరేసరికి మూడయ్యింది..!
★★★
ఆలయం ముందు ఆవరణలోనే దొరికిన కాటేజ్‌లో దిగి అందరూ నిద్రపోతుంటే.. నిద్ర రాక నేను కాటేజ్ ముందు నిలబడ్డ..!
వేకువ జామూ..
నిండు చంద్రుడి వెలుగు..
తుంగభద్రా నది హోరు ..
చల్లగా వీస్తున్న గాలి..
ఆహ్లాదకర వాతావరణంలో.. ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతున్న ” *రాఘవేంద్రుడి బృందావనం”* చుట్టూ అలుముకున్న ఆ అద్భుత క్షణాలను తాదాత్మ్యంతో ఆస్వాదిస్తున్న వేళ..
వెనక ఏదో అలికిడి..!
ఆ తన్మయంతోనే తిరిగి చూశాను..!
ఓ పన్నెండు సంవత్సరాల పిల్లగాడు ..
కాళ్లు గోకుతూ.. కళ్లు నలుముకుంటూ అప్పుడే నిద్ర లేసినట్లున్నడు ఏదో అడుగుతున్నడు..!
నాకు తెల్వని భాషలో ఏదో అంటుటే ..
ఆ శబ్దాలు నాకు తిట్ల లాగ వినిపించి నా మూడ్ ఖరాబైంది..!
మబ్బుల్నే మంచి అనుభూతిని చెడగొట్టిండన్న కోపంతో..
“ఏ.. నడువ్ ఇక్కన్నుంచి” అని గట్టిగా గదమాయించంగనే ..
రెండడుగులు వెనకు వేసి “ఎద్దూ.. బర్రీ ..'” అని గట్టిగా అరవడం మొదలుపెట్టిండు …!
వాని అరుపులకు అక్కడే నిద్రిస్తున్న జనాలతో పాటు … మా వాళ్లు కూడా నా చుట్టూ చేరిండ్రు.. అందరి మొకాల్లో నేనే ఏదో తప్పు చేసినట్లు ఫీలింగ్ ..!
అసలేం జరిగిందో నేను మా వాళ్లకూ..
వాడు వాని వాళ్లకు చెప్పంగనే ..
ఒకటే సారి అందరు ముసిముసిగా నవ్వుకున్నరు ..!
అంతగనం అరిచి గొడవ చేసిన వాన్ని ఏమీ అనకుండ.. ఎందుకు నవ్వుతున్నరో నాకర్థం కాలేదు..!
లోపలికి వెళ్లి … నా భార్యను నిలదీస్తే..
“వాడు మిమ్మల్ని తిట్టలేదండీ.. కన్నడ భాషలో మర్యాదగానే (ఏండ్రీ.. బిసి నీరు బేకప్పా) స్నానానికి వేడి నీళ్లు కావాలా అండీ” అని అడిగిండు.. !
“ఎండ్రికాయ మొకమోడా.. బేకూ కప్పా..
కన్నడ భాష అర్థం గాని మీకు .. వాడి మాటలు తిట్లలాగా వినిపిచ్చినట్టున్నయ్” అని పడీపడీ నవ్వింది..!
“అది సరే
ఎద్దూ.. బర్రె అని కూడా అరిసిండు కదా” అంటే ..
ఆ.. అవి కూడా తిట్లు కావు..
మీరు వాన్నెక్కడ కొడతారో అని భయపడి వాళ్ళ వాళ్లను “లేచి(ఎద్దూ) రండీ (బర్రీ) ” అని అరిచిండని అసలు విషయం చెప్పంగనే ..
నాక్కూడా నవ్వొచ్చి.. వాని మీద జాలేసింది..!
★★★
తర్వాత నేచురల్ కాల్స్ ముగించుకొని.. బామ్మర్ది తో తుంగలో మునుగుదామని తువ్వాల తీసుకొని నది వైపు నడుస్తుంటే .. “వేప పుల్లలు కావాలా” అని ఆడిగిండు వేపపుల్ల నోట్లో వేసుకొని మా వెనకే వస్తున్న డ్రైవర్..!
రాత్రంతా ఆందోళనాకరంగా ఉన్న డ్రైవర్ మొకం ప్రశాంతంగా కనపడింది….!
దర్శనానికి లేటవుతదేమోనని.. ఆ విషయాలేవీ అడగకుండ యాప పుల్లల్ని నములుతూ నది వైపు కదిలాము…!
పొర్లుదండాలతో సహా..
రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకొన్న తర్వాత .. పరిమళ ప్రసాదం ప్రశాంతంగా తింటూ మఠంలోనే భోజనాల వేళకై ఎదురుచూస్తుంటే .
“ఏమండీ.. భోజనాల తర్వాత పంచముఖి ఆంజనేయస్వామి గుడికి వెళదాం “.. అంది..!
రాత్రంతా టెన్షన్ లో ఉన్న డ్రైవర్ పరిస్థితి అంచనా వేస్తూ..ఔననీ..కాదనీ అన్నట్టు తలతిప్పిన..!
★★★
భోజనాల తర్వాత..
డ్రైవర్ ను “పంచముఖి వెల్దామా డ్రైవింగ్ చెయ్యగలవా ” అని అడిగితే “పోదాం సార్ “అని కాన్ఫిడెన్స్ తో చెప్పిండు..!
అందరూ బ్యాగులు సర్దుతుంటే ఏమండీ పిల్లలకు ఏమన్న కొందామండీ అంటే .. సరే తొందరగా రావచ్చని దగ్గర్లోని షాపులకు బండి మీదనే పోయినం..!
మాతో పాటే డ్రైవర్ కూడా షాపింగ్ కు రావడంతో అసలు రాత్రి ఏమైందో అడుగుదామనుకొన్నా అడగలేక పేరు మాత్రమే “శివ” అని తెలుసుకున్న..!
మా ఆవిడ టెడ్డీ బేర్లనీ.. గోలుసులనీ ఏవేవో ఏరుతుంటే.. అవన్నీ వేములవాడల మస్త్ దొరుకుతయ్.. అడ్డగోలు రేటు పెట్టి ఇక్కడ కొనకూ అని చెప్పంగనే చిన్న బుచ్చుకున్న నా భార్య అందరికీ గాజులు మాత్రమే కొని డ్రైవర్ చేతుల పెట్టింది.. జాగ్రత్తగా ఉంచమని..!
×××
మంత్రాలయం యాత్ర ముగించుకొని ఇల్లు చేరేసరికి రాత్రి పదకొండు..!
సామాన్లన్నీ సర్దుకొని.. బత్తాతో సహా కిరాయి లెక్కకట్టి మొత్తం పైసలు ఇచ్చి.. ఇంట్లోకి పోతుంటే..
“సార్ .. ఒక్క నిమిషం” అన్నడు శివ..!
నాక్కూడా రాత్రి ఇచ్చిన సెల్‌ఫోన్ గుర్తుకు వచ్చింది..!
సెల్‌ఫోన్ నా చేతికి అందిస్తూ.. మీఫోన్ నెం. ఉంచుకొని .. మీకు ఎప్పుడన్న కాల్ చెయొచ్చా అని అడిగి… మీది వేములవాడ కదా సార్ అన్నడు…!
“అవును ..నీకెట్ల తెలుసూ అంటే”…మంత్రాలయం లో బొమ్మలు కొంటుంటే .. మీ మాటల ద్వారా అర్థమైంది అని నవ్విండు…!
” *రాజన్న* దయతోటి నిన్న రాత్రే కొడుకు పుట్టిండు నాకూ” అని మెళ్లో ఉన్న బిల్లకు మొక్కిండు…!
నెలైనాంక ఖచ్చితంగ వేములవాడకు పోతం అవసరమైతే అక్కడ రూమ్ ఇప్పిస్తరేమోనని అడుగుతున్న సార్ ..
అని రాత్రి టెన్షన్ కు కారణం చెప్పిండు శివ..!
★★★
గౌరెల్లి.. ..
నాగోల్ నుంచి 15 కిలో మీటర్ల లోపలికి పోతే వస్తది మా ఊరు.. !
ఊరికి కొంచెం దూరంగా ఉంటది మా అత్తగారిల్లు….!
రెండేండ్లకింద మా మామ బిడ్డనే చేసుకున్న..!
మామ దుబాయిల ఉంటడు.. వాళ్లకు నా భార్య ఒకతే సంతానం..!
నెలలు నిండినయ్ .. తొలుచూరు కాన్పు దగ్గరుండి చూసుకుంటా అని వాళ్లింట్లనే ఉంచుకున్నది అత్తమ్మ..!
మొన్ననే కోఠీ మెటర్నిటీల చూపిస్తే..
డెలివరీకి ఇంక పది రోజుల టైముందని చెప్పిండ్రు..!
పొద్దునపూట కొంచెం నా భార్యకు సుస్తి అనిపిస్తే..
నేను డ్యూటీకి పోను.. మల్ల దవాఖానకు పోదాం పా అన్న..!
ఏంకాదు నేనున్న కదా చూసుకుంటా ..
నెలలు నిండితే గట్లనే ఉంటది అని ధైర్యం చెప్పి పంపింది మా అత్తమ్మ..!
ఊర్ల ఉండే ఆటో కొమురయ్యకు చెప్పి పెట్టింది ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని..!
పంపనైతె పంపింది కాని నా మనసంత ఇంటి మీదనే .. ఎట్లున్నదో అని..!
జడ్చర్ల దగ్గర్నుంచి ఫోన్ చేస్తే.. నొప్పులు వస్తున్నయ్ అని చెప్పి .. .నేను చూస్కుంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది..! అర్ధరాత్రైంది.. అక్కడ అత్తమ్మ తప్ప ఆమెకుతోడు ఎవరూలేరూ.. ఆడి మనిషి ఒక్కతే ఏం చేస్తుందోనని భయమైంది..!
ఆటో కోసం కొమురయ్య దగ్గరికి పోతే ఇంట్ల లేడు..! ఆ వెనుక లైన్లుండే నర్స్ దగ్గరికి పోయి నిద్ర లేపి విషయం చెప్పంగనే నేను ఐదు నిముషాలల్ల వస్తా… నువ్ నడవ్ అని వెళ్లగొట్టింది..!
అర్దగంటైనా రాకపోయే సరికి వేరే ఆటోలనన్న హాస్పిటల్ కు పోదామని మల్ల ఊల్లెకు పోతే ఒక్కటి కూడ కనపడలేదు..!
ఏం చెయ్యాలో అర్థం కాక..
ఎట్లరా భగవంతుడా అని ఇంటి
” *ఇలవేలుపు రాజన్నకు* ” చేతులెత్తి మొక్కి..
ఈ గండం గట్టెక్కిస్తె.. కొల్యాగ కట్టి మరీ గండాదీపంల నూనె పోస్తా అని మొక్కుకొని ఇంటి దగ్గరికి ఉరుకుతుంటే ..
దూరం నుంచి వస్తూ కనపడ్డ నర్స్ ను తోల్కోని తొందర తొందరగా ఇంటికి చేరుకొని లోపలికి అడుగు పెట్టంగనే.. కేర్ మని ఏడుపు వినవచ్చింది. అత్తమ్మకి…!
ఏమైందోనని దగ్గరికి పోయి చూస్తే ..
“ఏ *దేవుండ్లకు* మొక్కినవోగని .. ఆ దేవుడే వచ్చి కాన్పు చేసినట్టుంది.. నార్మల్ డెలివరీ అయింది ..
కొడుకు పుట్టిండు తల్లీ బిడ్డ ఇద్దరు మంచిగున్నరూ” అన్నదట నర్స్..!
ఆ మాట విన్న అత్తమ్మ కండ్లల్ల నీళ్లు తుడుచుకొని మనసులోనే *రాజేషునికి* మల్లోసారి మొక్కుకున్నదట!
“మీ ఊరి *దేవుని* దయతోటే నాకు పండంటి కొడుకు పుట్టిండు సార్ “అని ఆనందంగా చెప్పిండు శివ ..!
” _రోటికిఁ గట్ట దగిన నీ లీలలు.
మూఁటి కెక్కువైన నీదు గుణములు
కోటి మదన లావణ్యములైన
సాటిగాని నీ దివ్యరూపమును ..
తలచినంతనే_ ” .. అని త్యాగరాజ స్వామి అన్నట్లు …
*తలచినంతనే తన భక్తుల ఆపదలను* *గట్టెక్కించి.. గండాలను* *బాపే మన వేములవాడ* *రాజరాజేశ్వర స్వామి*
*కళ్ల ముందు చిద్విలాసంగా* *కనబడ్డాడు. నేనూ తన్మయుడనై భక్తి* *తో మనస్సులో దండం పెట్టు* *కున్నాను* !

*// స్మ ర్తృ గా మి…//*
(తలచిన పలికే దైవమ్..)
..రాజన్న దీవెనార్తి కథలు..
