
ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారికి లక్ష పుష్పార్చన, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవా పర్వాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో ప్రతిష్ఠా అలంకారమూర్తులను 108 బంగారు పుష్పాలతో అర్చించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దిన ఆచార్యులు వివిధ రకాల లక్ష పుష్పాలతో స్వామి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. యాదాద్రీశుడి ఆలయంలో ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామి, అమ్మవార్లను లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. బాలాలయంలో ఉదయం వేళ ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలు, కుంకుమలతో సహస్ర నామార్చనలు చేశారు. సాయంత్రం వేళ బాలాలయంలో వేద పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ స్వామికి సువర్ణ పుష్పార్చన, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవత్సోవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.