
భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే స్వామివారికి అర్చకులు పవిత్రాలు ధరింపచేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం విశేష తిరుమంజనం జరుగనుంది. ఉపాలయంలో లక్ష్మీతాయరు అమ్మవారికి విశేష తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల కారణంగా ఈ నెల 22వ తేదీ వరకు దేవస్థానంలో అధికారులు నిత్యకల్యాణాలు రద్దు చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.