
భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ పై విజయం సాధించాలని.. ప్రజలు గణేశుడిని ప్రార్థించాలని సూచించారు. కొవిడ్ 19పై పోరాటంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని.. అందరికీ సుఖ సంతోషాలు, శాంతి చేకూరాలని గణేశుడిని ప్రార్థించాలని రాష్ట్రపతి ప్రజలకు పిలుపునిచ్చారు.
‘ప్రజలందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, అదృష్టం, ఆరోగ్యం కలగాలని గణేశుని వేడుకుంటున్నా…’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 7వేలకు పైగా గవ్వలు, శంఖాలు ఉపయోగించి గణేశుని రూపాన్ని ఆవిష్కరించారు.
ఒడిశాలోని పూరీకి చెందిన శాశ్వత్ సాహూ అనే కళాకారుడు అగ్గిపుల్లలతో వినాయక ప్రతిమను రూపొందించాడు. మొత్తం 5,621 అగ్గిపుల్లలతో 23 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పు గల వినాయకుడి రూపాన్ని తయారు చేశాడు. ఇందుకు 8 రోజులు పట్టిందని తెలిపాడు.