
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ధి సమారోహణం నిర్వహించనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి చెప్పారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. రూ.1,200 కోట్లు ఖర్చు చేసి పంచలోహ రామానుజ విగ్రహన్ని తయారు చేయించినట్లు తెలిపారు. అలాగే, దివ్యసాకేతం లోపల 120 కిలోల బంగారంతో రామానుజాచార్యుల చిన్న విగ్రహం ఉంటుందని వివరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని దివ్యసాకేతంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్సవాల్లో భాగంగా 1,035 కుండలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహిస్తామని చెప్పారు. 2 లక్షల లీటర్ల నెయ్యితో 128 యాగశాలలు, 5 వేల మంది వేద పండితులతో మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాయజ్ఞం వల్ల కరోనా అంతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీజేఐ, కేంద్ర హోం మంత్రి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల జడ్జిలు, మంత్రులతోపాటు చైనా ప్రధానికి కూడా ఆహ్వానాలు అందజేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 14న మహాయజ్ఞంలో రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు.