
ఖైరతాబాద్ మహా గణనాథుడికి సమర్పించేందుకు భారీ కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను సిద్దం చేసినట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం తెలిపింది. ఈసారి కూడా 60 అడుగుల కండువాను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి తెలిపారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంప్రదాయబద్దంగా శివ పుత్రునికి పట్టు వస్త్రాలు, వినాయకుడికి ఇరువైపులా కొలువుదీరిన అమ్మవార్లకు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు వివరించారు. నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులతో వీటిని తయారు చేయించినట్లు చెప్పారు. పండగ రోజు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తామని చెప్పారు.
కాగా, వినాయక చవితి సమీపిస్తుండడంతో భాగ్యనగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలను కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు.