
మొన్నటి వరకు ఫాం లో లేక నిలదొక్కుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. అయితే చివరి రెండు మ్యాచ్ లలో మాత్రం ఎలా చెలరేగిపోయాడో మనం చూశాం. తనలోని ప్రతిభను ఒక్కసారిగా ప్రత్యర్థులకు పరిచయం చేశాడు. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. 32 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ 25 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో అందరి చూపూ ఈ యంగ్ ఫైర్ బ్రాండ్ పై పడింది.
మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడిన ఇషాన్ కిషన్.. తాను వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంతేకాదు.. ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉందని అతడు చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీనే స్వయంగా ఈ విషయం చెప్పాడన్నాడు. ‘‘విరాట్ భాయ్ తో చాట్ చేశాను. నువ్వు టీ20 వరల్డ్ కప్ కు ఓపెనర్ గా ఎంపికయ్యావ్.. రెడీగా ఉండమని విరాట్ భాయ్ చెప్పాడు. ఎలాంటి సవాల్ నైనా ఎదుర్కోవాలని సూచించాడు’’ అని తెలిపాడు. కాగా, ఐపీఎల్ లో బుమ్రా, హార్దిక్, క్రునాల్ పాండ్యా సహా అందరూ తనకు అండగా నిలిచారని చెప్పాడు. ఇది నేర్చుకునే దశ అని స్ఫూర్తి నింపారన్నాడు.