
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ ఇప్పటికే కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. మొయిన్ 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని అతడు స్పష్టం చేశాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సైతం నిర్ధారించింది.
టెస్టు క్రికెట్లో తనకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఉత్కంఠభరిత పోరాటాలు సాగించానని మొయిన్ అలీ చెప్పాడు. తనదైన రోజున ఎంతటి బ్యాట్స్ మన్ ను అయినా అవుట్ చేయగలిగానని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో కలిసి ఇకపై టెస్టు బరిలో దిగలేకపోవడం కొంచెం బాధగా ఉందని తెలిపాడు.
2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్‌ల్లో 2914 పరుగులు పరుగులు సాధించాడు. వాటిలో 5 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 36.66 యావరేజితో 195 వికెట్లు తీశాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్‌ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.