
ప్రపంచవ్యాప్తంగా కరోనా నిబంధనల ప్రకారం పలు క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో క్రికెట్ ఒకటి. ఇందులో పాల్గొనే క్రీడాకారులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే.. ఓ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలపై బీసీసీఐ.. ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠినమైన బయో- సెక్యూర్ బబుల్‌ని ఏర్పాటు చేసింది. ఈ బబుల్‌లో ఉన్న వారు.. వెలుపలి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడానికి అనుమతించరు. కానీ.. రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ ఈవెంట్‌కి హాజరవగా.. అతనితో పాటు కోహ్లీ కూడా వెళ్లాడు. ఈ పబ్లిక్ ఈవెంట్‌కి వెళ్లే ముందు ఈసీబీ నుంచి ఈ ఇద్దరూ అనుమతి తీసుకోలేదని తేలింది. ఆ పబ్లిక్ ఈవెంట్ ఫొటోలు బీసీసీఐ చేతికి రావడంతో.. విచారణకు బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు వెళ్లడంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరిష్ డోంగ్రె ప్రాతను కూడా బోర్డు పరిశీలిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఈవెంట్ లకు వెళ్లవద్దని.. బీసీసీఐ కార్యదర్శి జే షా ఒక్కో ఆటగాడికి ప్రత్యేకంగా నోటీసులు పంపినా కూడా.. నిర్లక్ష్యంగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.