
ఇంగ్లాండ్, భారత్ టెస్ట్ సిరీస్ లో భాగంగా హెడింగ్లే వేదిక గా ఈ రోజు ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుకు చాప చుట్టేశారు. ఇంగ్లాండ్ పేసర్లు చెలరేగడంతో కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ 19, రహానే 18 పరుగులు మినహ మిగతా బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ పేసర్ ఆండర్సన్ ఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను అవుట్ చేయడం ద్వారా టీమిండియా పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆపై పుజారా, కోహ్లీలను కూడా పెవిలియన్ చేర్చిన ఈ సీనియర్ బౌలర్ భారత టాపార్డర్ ను కకావికలం చేశాడు. ఆండర్సన్ కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఓల్లీ రాబిన్సన్ (2), శామ్ కరన్ (2), క్రెగ్ ఒవెర్టన్ (3) కూడా స్వింగ్ బౌలింగ్ తో భారత బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. దాంతో భారత్ కు కనీసం 100 పరుగుల మార్కు చేరే అవకాశం కూడా దక్కలేదు.