
కొవిడ్-19 వల్ల మరణించే ముప్పును రెట్టింపు చేసే ఒక జన్యువును ఆక్స్ ఫర్డ్ వర్సిటీ శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఎల్ జెడ్ టీఎఫ్ఎల్-1 అనే ఈ జన్యువు… కొవిడ్ సోకినప్పుడు ఊపిరితిత్తులు వ్యవహరించే తీరును మార్చేస్తుందని వారు వెల్లడించారు. జన్యు టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వారు ఈ అధ్యయనం చేపట్టారు. దక్షిణాసియా నేపథ్యం ఉన్న వారిలో 60శాతం మందికి ఈ జన్యువు ఉంటుందని.. అదే యూరోపియన్ వారసత్వం ఉన్నవారిలో 15శాతం మందికి మాత్రమే ఉంటుందని వివరించారు. అందుకే భారత్ సహా మరికొన్ని దేశాల్లో కొవిడ్ మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని సూత్రీకరించారు.
సాధారణంగా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు దానికి స్వాగతం పలికే ఏసీఈ2 అనే ప్రొటీన్‌ను సెల్లైనింగ్స్ తగ్గించేస్తాయి. ఫలితంగా వైరస్ ఊపిరితిత్తుల్లోని కణాల్లోకి చొరబడలేదు. కానీ, ఈ జన్యువు ఉన్నవారిలో సెల్ లైనింగ్ ఏసీఈ2 ప్రొటీన్లను తగ్గించలేదు. ఫలితంగా దీనివల్ల కరోనా పెద్ద ఎత్తున శరీర కణాల్లోకి చొరబడి వేగంగా పెరిగిపోతుంది. ఇది ఊపిరితిత్తుల వాపునకు దారి తీస్తుంది. ఫలితంగా వారు మరణించే ముప్పు రెట్టింపు అవుతుంది. ఈ జన్యువు ఉన్న వారికి వీలైనంత త్వరగా, పెద్ద ఎత్తున టీకాలు ఇవ్వడం ద్వారా కొవిడ్ ముప్పును వేగంగా తగ్గించవచ్చని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నేచర్ జెనెటిక్స్ లో గత వారం ఓ వ్యాసం ప్రచురితమైంది.