
కేరళ పండగ ఓనంను మలయాళీలు ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్లర్లేదు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ పండగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. సాధారణ ప్రజల నుంచి సెల్రబిటీల వరకూ ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం పరిపాటి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కూడా ఓనం పండగ రోజు ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి.. కొబ్బరికాయ కూడా కొట్టారు. ఆయా ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయక దుస్తుల్లో ఉన్న థరూర్ కొబ్బరికాయ కొడుతున్న ఓ ఫొటో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫొటో కంటే ఆయనపై వచ్చిన మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. థరూర్ కొబ్బరికాయ కొడుతున్న పోజును వివిధ సందర్భాలకు అన్వయించి నెటిజన్లు రూపొందించిన మీమ్స్ అలరించాయి. తనపై వచ్చిన ఈ మీమ్స్ ను థరూర్ కూడా ఆస్వాదించారు. ఓ మూడు మీమ్స్ తనకు బాగా నచ్చాయని పేర్కొన్నారు.