
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో మరో వివాదానికి తెరతీశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తన సోదరి ప్రియాంక గాంధీ సామర్థ్యాలను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వ్యాఖ్యానించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించకపోవడం వెనుక ఇదే కారణం అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ప్రియాంక అచ్చం తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీలానే ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని పీకే అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీని తొలిసారిగా పాట్నాలో కలిశానని, అప్పుడే తనను కాంగ్రెస్ కోసం పనిచేయమని కోరారని తెలిపారు. అయితే, బిహార్‌లో రాజకీయ పరిస్థితులు సక్రమంగా లేవని, ముఖ్యంగా కాంగ్రెస్ కు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయని చెప్పానని పేర్కొన్నారు. కాగా, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు