
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనేదాకా.. రైతులకు న్యాయం జరిగేదాకా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాం… వేటాడుతాం అంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు . కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. పంజాబ్ లో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నారని.. తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని చెప్పారు.
ధాన్యం కొనుగోలు పై కేంద్రం నుంచి సమాధానం లేదని అన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం… తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సమాధానం లేదని అన్నారు. దీనికి నిరసనగా 18న ఇందిరాపార్క్ లో టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎఫ్ సీఐ కొనుగోలు చేస్తామంటే.. కేంద్రం నిరాకరిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కొనుగోలు విషయం నిర్ధరణ కోసం తానే స్వయంగా దిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. ఏడాదికి రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వినతిపై పరిశీలిస్తామని కేంద్రమంత్రి తెలిపినట్టు కేసీఆర్ వివరించారు. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధానికి, వ్యవసాయ మంత్రికి లేఖలు రాస్తా అని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తామన్నారు.
తెలంగాణలో రైతాంగానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, నీటి పన్నులు లేకుండా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగానే అని అన్నారు. వరి ధాన్యం కొంటారా లేదా అని బండి సంజయ్‌ని అడిగామని.. అయితే ఆయన కొనుగోలు కేంద్రాల దగ్గర డ్రామాలాడుతున్నారన్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలని.. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలని సీఎం ప్రశ్నించారు.