
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైటెక్స్ లో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తొలిసారి 2001 సంవత్సరంలో జల దృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రకరకాల అప నమ్మకాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతల కారణంగా పార్టీ నేడు ఈ స్థితిలో ఉందని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగిందన్నారు.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.