
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బృందం ఢిల్లీ వెళ్ళింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బృందంలోని ఐదుగురు సభ్యులు రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించి.. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కోరనున్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోతోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అజెండాపై చర్చించారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం చేయనుంది. చంద్రబాబుతో పాటు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు, మరో 14 మంది ముఖ్యనేతలు కలిసి మొత్తం 18 మంది ఢిల్లీ వెళ్లారు. పర్యటన వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు అప్పగించారు.
ఎన్టీఆర్ భవన్ పై దాడికి సంబంధించి సీబీఐ విచారణ జరపాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కోరటంతో పాటు అవసరమైతే న్యాయవ్యవస్థ తలుపు తడతామని పయ్యావుల కేశవ్ తెలిపారు. మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు.. వైసీపీ నాయకులు కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు. రెండు పార్టీల నాయకులు.. ఢిల్లీ టూర్లకు సిద్ధమవడంతో.. ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఢిల్లీ వేదికగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.