
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కాదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది. ఏపీ రాజధాని విశాఖ పట్టణమని కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన డాక్యుమెంట్ లో స్పష్టం చేసింది. పెట్రోలు ధరలపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు, ఈ ఏడాది జూలై 26వ తేదీన పెట్రోలియం శాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఏపీ రాష్ట్ర రాజధానిగా విశాఖను చేర్చారు. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని తెలిపిన కేంద్ర ప్రభుత్వం… ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల పెంపు అంశంపై అంచనాకు సంబంధించిన డాక్యుమెంట్లో ఏపీ రాజధానిని విశాఖగా ప్రకటించింది. రాష్ట్రాల రాజధానుల పట్టికలో ఏపీ రాజధాని విశాఖపట్టణాన్ని చేర్చింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై అమరావతి జేఏసీ తీవ్రంగా మండిపడుతోంది. ఏపీ రాజధానిపై కేంద్రం పదేపదే తప్పులు చేస్తోందని జేఏసీ విమర్శిస్తోంది. కోర్టు అనుమతితోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను తరలిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన కొద్ది రోజులకే కేంద్ర ప్రకటన వెలుగు చూడటం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం, అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. రాజధాని కోసం 29 గ్రామాల రైతులతో చర్చలు జరిపి 33 వేల ఎకరాల భూమిని భూసమీకరణ పథకం ద్వారా సేకరించారు. రైతులతో రాజధాని ఒప్పంద అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతికి బదులు మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ, విశాఖలో కార్యనిర్వాహక రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు రాష్ట్ర హైకోర్టులో కేసులు వేశారు. రైతుల పిటిషన్లపై విచారణను న్యాయస్థానం నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఏపీ రాజధాని విషయంపై కేంద్ర పెట్రోలియం శాక మౌఖిక వివరణ ఇచ్చిందని సమాచారం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల విషయంలో కూడా ఇదే రకమైన పొరపాట్లు జరిగాయని తెలుస్తోంది. ఆ రాష్ట్రాల ప్రధాన నగరాలకు బదులుగా రాజధాని అనే పదాన్ని డాక్యుమెంట్లో చేర్చామని పెట్రోలియం శాఖ అధికారులు వివరణ ఇచ్చారని సమాచారం.