
టెలికాం సంస్థ జియో, గూగుల్ తో కలిసి రూపొందిస్తున్న స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్. ఈ ఫోన్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు జియో సంస్థ గురువారం ప్రకటించింది. సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు జియో ఇదివరకే తెలిపింది. జియో ఫోన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని.. వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి తేలేకపోవడానికి అదే కారణమని జియో సంస్థ వెల్లడించింది. ఫోన్ తయారీకి సంబంధించి మెరుగైన పురోగతినే సాధించామని పేర్కొంది. దీపావళి నాటికి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ల కొరత కూడా తగ్గే అవకాశం ఉందని జియో అభిప్రాయపడింది. జియోఫోన్ నెక్ట్స్ ను దీపావళి సందర్భంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
గూగుల్ తో కలిసి ఈ ఫోన్ ను జియో తీసుకురానుంది. 4జీ నెట్ వర్క్ తో ఆండ్రాయిడ్ యాప్స్ తో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ 2జీ ఫోన్లు ఉపయోగించేవాళ్లకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనుభవం కావాలంటే.. జియో ఫోన్ నెక్స్ట్ బెస్ట్ ఫోన్ అని జియో చెబుతోంది. ఈ ఫోన్ ధర రూ.3499 గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే 3500 రూపాయల లోపే ఆండ్రాయిడ్, 4జీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అందుకే.. దీన్ని రిలయన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ గా అభివర్ణించింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత వెంటనే సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. 4జీ నెట్ వర్క్ తో పాటు బిగ్ స్క్రీన్, ఏఐ, ఫాస్ట్ ప్రాసెసర్, గుడ్ కెమెరా, గొరిల్లా గ్లాస్ లాంటి బెస్ట్ ఫీచర్లతోనే ఈ ఫోన్ విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది.