
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో కార్పోరేట్ బ్రాండ్ లకు కేరాఫ్ ఆడ్రస్ గా మారిన మహేశ్ తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ ‘బిగ్ సి’ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ఈ మేరకు బిగ్ సి సంస్థ… మహేశ్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేశ్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఇప్పటికే పలు పెద్ద బ్రాండ్ల కు ప్రచారకర్తగా ఉన్న మహేశ్ ఈ ఎండార్స్ మెంట్స్ లో తనకు పోటీ లేదని నిరూపించాడు. హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో కలసి ఎ.ఎం.బి సినిమాస్ నిర్మించిన మహేశ్ ఆ తర్వాత సొంత దుస్తుల కంపెనీ ‘హంబల్’ను కూడా మొదలెట్టాడు. గతంలో పలువురు తారలు ప్రచారం చేసిన బిగ్ సి కి ఇప్పుడు మహేశ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తుండడం విశేషం.
మార్కెట్లో మరింత పట్టుసాధించడానికి ‘బిగ్ సి’ విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 250 స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా వచ్చే రెండేళ్లలో మరో 250 స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.125 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టోర్లను చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కరోనాతో కుదేలైన మొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు, వచ్చే ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తమ సంస్థలో ప్రస్తుతం 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 4 వేలకు చేరుకోనున్నదన్నారు.