
హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణం కేవలం మూడు గంటలే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా ..!!! మన భాగ్యనగరానికి త్వరలో కల సాకారం కాబోతుంది. హైదరాబాద్ వాసులకు త్వరలోనే మరో అద్భుతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. త్వరలో హైదరాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ రాబోతున్నది . దీంతో కేవలం మూడున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు.
ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ విషయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 18న టెండర్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించేందుకు టెండర్లు పిలిచారు. హైదరాబాద్-ముంబై మధ్య మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భూభాగాల్లో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేపట్టడంతో పాటు భూసేకరణపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లా అధికారులకు ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు సమాచారాన్ని తెలియజేసింది.
ఈ ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్ చేస్తూ నిర్మించాలని భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 8 బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో నాలుగు వరకు ముంబైతో అనుసంధానం చేయనుంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ 2028లోపు అందుబాటులోకి రానుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు లైన్ ఏర్పాటుకు రూట్ మ్యాప్ పనులు మొదలయ్యాయి. తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. గూగుల్ మ్యాపింగ్ కూడా దాదాపు పూర్తయినట్టే. గూగుల్ మ్యాపింగ్ ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్ నిర్మించనున్నారు. పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.