
‘‘ఎవరూ లేనప్పుడు పోలీసుల అండతో మా కార్యాలయంపై దాడికి దిగడం మగతనం కాదు. వైసీపీ నాయకులు నిజంగా మగాళ్లయితే.. చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రండి. మేమేంటో చూపిస్తాం…’’ అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ చేశారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడే పోలీసులు.. తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలపై చేసిన దాడిగా చూస్తున్నామన్నారు. అందుకే ప్రజల పక్షాన పోరాడుతూ చంద్రబాబు దీక్షకు కూర్చున్నారని తెలిపారు. తప్పుడు కేసులకు తెలుగుదేశం బయపడదని బోండా ఉమా స్పష్టం చేశారు.
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సర్వనాశనమైందని, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని బోండా ఉమా అన్నారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే మాదకద్రవ్యాల వ్యాపారంలోకి దిగారని, రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆరోపించారు. ఉన్న బ్రాండ్లు తొలగించి జె-బ్రాండు కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మమ్మల్ని చంపడానికి చూశారు. చావు అంచుల వరకు వెళ్లి ఎలాగోలా బయటపడ్డాం. మాపై మాచర్లలో దాడి జరిగిన విషయం వాస్తవమో కాదో డీజీపీనే చెప్పాలి. ఆరోజు మాపై దాడి చేసిన గూండాకు మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చారు. ఏపీ నుంచి వెళ్లే ప్రతీ కారునూ తెలంగాణ పోలీసులు తనీఖీలు చేస్తున్నారు. దీనికి కారణం వైసీపీ నేతల డ్రగ్స్ వ్యాపారమే’’ అని బోండా ఉమా వ్యాఖ్యానించారు.