
తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో నిర్మల్ లో ప్రతిష్ఠాత్మకంగా సభ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సభలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి 11.30 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్ కు ఆయన చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 1.50 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరి 2.30 గంటలకు నిర్మల్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. వెయ్యి ఉరుల మర్రి వద్ద గల పోరాట యోధుల స్మారక స్తూపానికి నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.50 గంటల వరకు నిర్మల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుగుపయనమవుతారు.
అమిత్ షా బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గడిచిన మూడు రోజులుగా అన్ని జిల్లాల అధ్యక్షులతో, మండల పార్టీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సభ కోసం దాదాపుగా పది రోజుల నుంచి బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. సభకు దాదాపు లక్ష మందిని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మల్లోని ప్రధాన కూడళ్లు, అన్ని మార్గాలు ఇప్పటికే కాషాయమయమైపోయాయి.