
టోక్యో పారాలింపిక్స్ లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్ లో చైనా ప్లేయర్ యింగ్ ఝోపై 0-3 తో ఓడి.. రజత పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ లో చైనా క్రీడాకారిణి మియావో జాంగ్ తో పోటీపడిన భవీనా.. ఆమెను 3-2తో ఓడించింది. పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ లో భారత్ కు పతకం రావడం ఇదే మొదటిసారి.
భవీనాబెన్ పటేల్ మెరుగైన ప్రదర్శన వెనక ఆమె పడిన కష్టం కూడా చాలా ఉంది. అదేంటంటే.. గుజరాత్ లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనాబెన్ కు చిన్నతనంలోనే పోలియో కారణంగా నడుము కిందిభాగం అచేతనంగా మారింది. అలా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. ఆటపై ప్రేమతో మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. ఐదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్ కు భవీనా ఎంపికైనా సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా ఎన్నో సవాళ్లను దాటి జీవితంలో విజేతగా నిలిచిన భవీనా.. అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తూ ఓ దశలో ప్రపంచ రెండో ర్యాంకునూ చేరుకుంది.
Tokyo Paralympics: Bhavina bags silver after losing gold medal match to China's Zhou Ying
Read @ANI Story | https://t.co/tFgzxtFu5O#TokyoParalympics #BhavinaPatel pic.twitter.com/DfxVzfu0rd
— ANI Digital (@ani_digital) August 29, 2021
‘‘నన్ను నేను దివ్యాంగురాలినని ఎప్పుడు అనుకోలేదు. నేనేదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో అన్నివేళలా ఉండేది. మేము (దివ్యాంగులు) వెనకబడిలేమని నేనిప్పటికే నిరూపించాను. పారా టేబుల్ టెన్నిస్ ఆట కూడా ఇతర క్రీడల వలే ముందుంది. చైనాతో పోటీపడాలంటే చాలా కష్టమని చాలా మంది చెబుతారు. తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నేను నిరూపించాను. మీరు కూడా అనుకుంటే ఏదైనా చేయొచ్చు…’’ అని భవీనాబెన్ పటేల్ తెలిపింది.