
ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ, వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే సీజన్ లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం టెండర్లు ఆహ్వానించింది. కొత్త ఫ్రాంచైజీ ఒక్కో దానికి బేస్ ప్రైస్ రూ. 2000 కోట్లు ఉండాలని నిర్ణయించారు. ఫలితంగా బీసీసీఐ ఈ రెండు జట్ల ద్వారా ఏకంగా రూ. 5 వేల కోట్లకు పైనే ఆర్జించనుంది. నిజానికి కొత్త జట్ల బేస్ ప్రైస్‌ను తొలుత రూ. 1700 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత సవరించి రూ. 2000 కోట్లుగా ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గ్రూప్ మ్యాచులు, ప్లేఆఫ్స్, ఫైనల్‌తో కలిపి ప్రతీ ఐపీఎల్ సీజన్లో మొత్తంగా 60 మ్యాచులు ఉంటాయి. వచ్చే సీజన్ నుంచి వీటి సంఖ్య 74కి చేరనుంది. దీంతో మరిన్ని రోజులు, మరిన్ని యాడ్స్, మరింత ఆదాయం… రాబట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లెక్కన ఐపీఎల్ టీమ్ ను కొనుగోలు చేయాలంటే ఆ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించేదై ఉండాల్సిందే. అయితే, కన్సార్టియంగా… అంటే మూడు కంపెనీలు ఒక సంస్థగా ఏర్పడి కూడా బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చు. మూడు కంటే ఎక్కువ కంపెనీలు మాత్రం ఒకటిగా ఏర్పడేందుకు అనుమతించరు.
కొత్త జట్ల కోసం బిడ్స్ వేసే ప్రక్రియను సులభతరం చేస్తే మరింత ఆదాయం ఆర్జించవచ్చని గ్రహించిన బీసీసీఐ… బిడ్డింగ్ విధానంలో స్పల్ప మార్పులు చేసింది. అహ్మదాబాద్, లక్నో, పూణెల నుంచి కొత్త ఫ్రాంచైజీలు వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియాల సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఫ్రాంచైజీలు అటువైపే మొగ్గు చూసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, అదానీ గ్రూప్, ఆర్పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్, ప్రముఖ బ్యాంకర్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.