
దళిత బంధు పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి దళితులను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని ఈసీ నిలిపివేయడం వెనుక కుట్ర ఉందని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఆదేశించబోదని, ఉద్దేశపూర్వకంగానే లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేసిందని ఆరోపించారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడిన సొమ్మును ఎందుకు ఫ్రీజ్ చేశారో? కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
ఈ పథకాన్ని ఈసీ అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతోనే సోమవారం రూ.250కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. వారు అనుకున్నట్టే పథకం నిలిచిపోయాక.. ఆ పాపాన్ని ఇతరుపై వేయాలని చూస్తున్నారని విమర్శించారు.
బ్యాంకులో పడిన నిధులను లబ్ధిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని గతంలోనే జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కు తాము వినతిపత్రం ఇచ్చామని సంజయ్ గుర్తు చేశారు. పథకానికి తామే అడ్డుపడ్డామంటూ టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవ మొదలైంది.
దళిత బంధును బీజేపీయే నిలిపివేయించిందని ఆరోపిస్తూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని అందర్నీ చెదరగొట్టారు.