
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అద్భుత రీతిలో ముగించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు లక్ష మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. కమలం గుర్తును గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఎంతగానో దోహద పడిందని, ప్రభుత్వంపై బండి సంధించిన విమర్శనాస్త్రాలు కూడా పార్టీకి ప్లస్ అయ్యాయన్న వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం పాల్గొననున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తారు. స్మృతి ఇరానీ కూడా 5 కిలోమీటర్ల మేర యాత్రలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్ లోని గాంధీ విగ్రహానికి వారు నివాళులర్పిస్తారు. అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించనున్న సభకు వారు హాజరవుతారు. ఈ మేరకు ఏర్పాట్లపై బండి సంజయ్ గురువారం సమీక్షించారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందని ఊహించలేదని చెప్పారు. ప్రజలు సమస్యలు వివరిస్తుంటే కన్నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.