
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలే సక్రమంగా ఇచ్చే పరిస్థితులు లేవని, దళిత బంధు ద్వారా దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎలా ఇస్తారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర సోమవారంతో 115 కిలోమీటర్ల దూరం పూర్తిచేసుకుందని ఆయన తెలిపారు. కోట్లు వచ్చే భూములను కంపెనీలకు అప్పగించి ఉద్యోగాలు వస్తాయంటూ టీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 95 శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలు చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో నిరుద్యోగులు లేకుండా చేస్తానన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని మండిపడ్డారు. దుబ్బాకలో కేసీఆర్ మెడలు వంచామని.. వచ్చే హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తుంగలో తొక్కడం ఖాయమని సంజయ్ అన్నారు. ఎండను, వానను లెక్క చేయకుండా 10వ రోజు యాత్ర చేస్తున్నాం.. అంటే ప్రజల ఆశీస్సులు తమకు ఏవిధంగా ఉన్నాయో గ్రహించాలని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసి చార్మినార్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.