
అంచనాలను అందుకుంది. ఊహించిన విధంగానే ఉంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే.. ఆ ట్రైలర్ ఎలా ఉండాలని సగటు అభిమాని కోరుకుంటాడో.. అంతకు మించే ఉంది. నందమూరి నటసింహ గర్జన.. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే రెండు టీజర్లతో అంచనాలను పెంచేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు ఈ ట్రైలర్ తో ఆ అంచనాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. అలాగే, ట్రైలర్ తో పాటు చిత్రం విడుదల తేదీని కూడా సినిమా యూనిట్ ప్రకటించింది. ‘డిసెంబరు 2’న థియేటర్లలో ‘అఖండ’ గర్జన వినబడబోతోంది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..
కథ విషయంలో క్లారిటీ రాకపోయినా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది ట్రైలర్. ‘విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరబోతోంది’ అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభమయ్యే ట్రైలర్.. బాలయ్య రెండు గెటప్పుల్లోని డైలాగులతో సాగుతుంది. ‘అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. మేమా సమస్యకే పిండం పెడతాం’, ‘ఒక మాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం.. దైవ శాసనం’.. లాంటి డైలాగులు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
‘అఖండ’ ట్రైలర్ లో బాలయ్య రెండు పాత్రలను చూపించిన బోయపాటి.. మరో పాత్ర ఏదో ఉందన్న ఆసక్తిని కలిగించాడు. ఇందులో విలన్ గా శ్రీకాంత్ ను చూస్తుంటే.. ‘లెజెండ్’లో జగపతిబాబు గుర్తొచ్చాడు. అలాగే, జగపతి బాబు కూడా ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అఘోరా పాత్రలో భీకరంగా ఉన్న బాలయ్య.. మరో పాత్రలో మాత్రం అందంగా కనిపించాడు.
చివర్లో ‘అఖండ’ అని బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపించగా.. బాలయ్య ‘నేనే నేనే నేనే’ అని గంభీరంగా చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా 2:19 నిముషాల నిడివిగల ఈ ట్రైలర్.. బాలయ్య అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులనీ ఆకట్టుకునేలా ఉంది. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ స్థాయిలో ట్రైలర్ ఉంటే.. రికార్డులు ఆగుతాయా? బద్ధలైపోవూ..! సరిగ్గా అదే జరుగుతోందిప్పుడు. ట్రైలర్ విడుదలైన పది గంటల్లోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో నెం.1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది.