
నందమూరి బాలకృష్ణ నటించిన హైఓల్టేజ్ పవర్ ప్యాక్డ్ మూవీ.. ‘అఖండ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు సంబంధించి అనేక తేదీలను పరిశీలించిన చిత్రబృందం.. తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి అదే తేదీన రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా వాయిదా పడింది. దీంతో.. అఖండ.. ఆ డేట్ ను లాక్ చేసినట్లు సమాచారం.
సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. దీనిపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందుకు తగ్గట్లుగానే విడుదలైన రెండు టీజర్లూ సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అఘోరా గెటప్ లో బాలయ్యను పరిచయం చేసిన టీజర్.. ఓ ప్రభంజనమే సృష్టించింది. దీంతో.. ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఊహకందని కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. బాలకృష్ణ.. ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో మూడో పాత్ర.. అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. శ్రీకాంత్, జగపతిబాబు ప్రతినాయకులుగా నటిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం. వినాయకచవితి నాడు తొలిపాట విడుదల కానుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చుతున్నారు.