
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు. అన్నింటి గురించి మాట్లాడే మోదీ.. రెండు అంశాలపై మాత్రం ఎప్పుడూ మాట్లాడడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ నోరెత్తడంలేదు.
సరిహద్దుల్లో చైనా మన భూభాగంలోకి ప్రవేశిస్తున్నా మోదీ సర్కార్ ఏమీ చేయలేకపోతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సైనికులు దూసుకువస్తున్నారు. మోదీ ప్రభుత్వం వారిని అడ్డుకోలేకపోతోంది. చైనాను ఎదుర్కోవడంలో మోదీ సర్కారు సమర్థంగా పనిచేయట్లేదు.
ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెలరేగిపోతోన్న ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతోంది. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలోనూ మోదీ సర్కారు విఫలమైంది… అని ఒవైసీ విమర్శలు గుప్పించారు.