
నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముందున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందూత్వ నినాదాన్ని అందుకున్నారు. తమదే నిజమైన హిందూత్వ పార్టీ అని ప్రకటించారు. నిజమైన హిందూత్వకు నిర్వచనం చెప్పారు. బుధవారం ఓ టీవీ షోలో మాట్లాడిన ఆయన.. పలు ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చారు.
‘‘హిందూత్వ అంటే నిజమైన అర్థం కలిపి ఉంచడం. కానీ, జరుగుతున్నది ఏంటి? హిందూత్వకు ప్రతినిధులమని చెప్పుకుంటున్న పార్టీ.. మతాల పేరుతో దేశాన్ని విడగొడుతోంది. నిజమైన హిందూత్వానికి అర్థాన్ని మార్చేసింది. 130 కోట్ల మంది ప్రజలను మతాలకు అతీతంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని మా పార్టీ కోరుకుంటోంది. అదే నిజమైన హిందూత్వ అని నేను నమ్ముతున్నాను. అందుకే గర్వంగా చెబుతున్నాను.. దేశంలోని ఏకైక హిందూత్వ పార్టీ మాదే ’’ అని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు.
మతం పేరుతో ప్రజలను విడగొట్టడం, అల్లర్లకు వ్యూహాలు పన్నడం, దళితులపై అకృత్యాలకు పాల్పడటం హిందుత్వ కాదని, మనుషుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడమే హిందుత్వమని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ‘సాఫ్ట్ హిందూత్వ’ వాదనను తాను భుజానికెత్తుకున్నానన్న ఆరోపణను ఆయన ఖండించారు. ”సాఫ్ట్ హిందుత్వ అంటే ఏమిటో నాకు తెలియదు. ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను కలిసికట్టుగా ఉండేలా చూడడమే హిందుత్వ. హిందుత్వ అంటే విడగొట్టడం కాదు, కలిపి ఉంచడం” అని తేల్చిచెప్పారు.