
తెలుగు రాష్ట్రాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు జారీ చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ట్రాఫిక్ చలానాలు జారీ నిమిత్తం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్ మెంట్ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ రద్దీ, ఎక్కువ ముప్పు ఉండే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, సంక్లిష్టమైన కూడళ్లలో ఆ పరికరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
స్పీడ్ కెమెరాలు, సీసీ టీవీ కెమెరాలు, స్పీడ్ గన్స్, బాడీ వేరబుల్ కెమెరా, డ్యాష్ బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వేయింగ్ మిషన్ తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో ని 11 జిల్లా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్ చెరువు, సంగారెడ్డిలలో ఆయా పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఆయా ప్రాంతాల్లో నిర్దేశిత వేగానికి మించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, నో పార్కింగ్ జోన్ లో వాహనాలను ఉంచినా, హెల్మెట్, సీటు బెల్టు ధరించని వారిని ఈ కెమెరాలు పట్టేస్తాయి. కెమెరాల్లో నిక్షిప్తమైన సాక్ష్యాధారాల ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు చలానాలు జారీ చేస్తారు.