
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై దుండుగుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతలను ఇళ్ల నుంచి బైటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఇళ్ల నుంచి బైటకు వచ్చిన నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖపట్టణంలోనూ పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తో పాటు మరో పది మంది నేతలను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్పోరేటర్ ముత్యాల శ్రావణి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గోదావరి జిల్లాల్లోనూ టీడీపీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగింది. మాజీ ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, చింతమనేని ప్రభాకర్లతో పాటు బడేటి చంటి, గన్ని వీరాంజనేయులు, కాగిత క్రిష్ణప్రసాద్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగి మాజీ మంత్రి దేవినేని ఉమ, అరవింద బాబులను అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాయలసీమలోనూ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి, అమీర్‌బాబు, హరిప్రసాద్, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.