
సంక్షేమ పథకాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించడం, ఆ పథకాల ఫలాలను సమయానికి లబ్దిదారులకు అందించడానికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడమే పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ కొత్త చరిత్ర నెలకొల్పడానికి కారణమైంది. ఆంధ్రాలోని మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ కైవసం చేసుకోవడంతో పాటు , రాష్ట్రంలోని 90% మండల పరిషత్ లను కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఇప్పటి వరకూ ఏ అధికార పార్టీ కూడా రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు అన్నింటినీ గెలవలేదు.
వైఎస్సార్సీపీ ప్రత్యర్థి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్క జిల్లాలో కూడా రెండంకెల జెడ్పీటీసీ స్థానాలను గెలవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడానికి అవసరమైన స్థానాలను కూడా ఈ ఎన్నికల్లో టీడీపీ సాధించలేదు. టీడీపీ మొదట స్థానిక పోరులో అభ్యర్థులను బరిలో నిలిపి కొన్ని నెలల పాటు ప్రచారం నిర్వహించింది. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత, సడెన్‌గా పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పలువురు టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ, ఓడిపోయారు. పరిషత్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ 83 శాతం సీట్లను గెలిచింది.
అసాధారణమైన ఈ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్సీపీకి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు ఉందని స్పష్టమైంది. ప్రభుత్వం కరోనా మహమ్మారిని నియంత్రించడం, రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించడం ప్రభుత్వానికి ప్లస్ పాయింట్లుగా మారాయి. టీడీపీ ఊహించినట్టుగా ప్రభుత్వ పాలనా వైఫల్యం, కోర్టు తగాదాలు, కోర్టుల్లో చీవాట్ల వంటి అంశాలు ప్రజల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని పలుచన చేయలేదు.
పరిషత్ ఎన్నికలకు ఏప్రిల్ 8న పోలింగ్ జరిగినా, ఓట్ల లెక్కింపుపై కోర్టులు స్టే విధించడం, హైకోర్టు ఆ స్టేను ఎత్తివేయడంతో ఫలితాలు సెప్టెంబర్ 16న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జరిగిన మరో ఘోర పరాభవం కుప్పంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయడం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మొత్తం నాలుగు జెడ్పీటీసీ సీట్లనూ వైసీపీ గెలిచింది. 65 మండల పరిషత్ స్థానాల్లో 62 గెలిచింది. కుప్పం మండలంలోని 19 ఎంపీటీసీల్లో వైసీపీ 17 గెలిచింది. గుడిపల్లిలోని 12ఎంపీటీసీలు, రామకుప్పంలో 16, శాంతిపురం మండలంలోని 18 ఎంపీటీసీలకు గాను 17 సీట్లను వైసీపీ గెలిచింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో సైతం ఇదే ఫలితాలు వెలువడ్డాయి. టెక్కలిలోని నాలుగింటికి నాలుగు జెడ్పీటీసీలు, 78 ఎంపీటీసీలకు గాను 72 ఎంపీటీసీల్లో వైసీపీ విజయ బావుటా ఎగురవేసింది.
2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ పార్టీకి దక్కిన ఘన విజయమిది. తిరుపతి ఉప ఎన్నికలు, పంచాయతి, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. స్థానిక పోరులో రూలింగ్ పార్టీ కి 50% కంటే ఎక్కువ ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం యాభై శాతం ఓట్లను పైగా జగన్ పార్టీ సాధించింది. అర్బన్, రూరల్ ఏరియాల్లో కూడా అదే ఫలితాలను సాధించిన మొట్టమొదటి పార్టీగా వైఎస్సార్సీపీ ఘనతకెక్కింది.
ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల వాదోపవాదాలు ఏమైనా సరే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు రూపొందించిన ప్రణాళిక, వాటిని సమయానికి అందించడంలో ప్రదర్శిస్తోన్న శ్రద్ధ, వెనుకబడిన ప్రతి వర్గానికీ సంక్షేమ పథకాలు అందించడం, గ్రామ వ్యవస్థ స్వరూపాన్ని మార్చడం, వార్డు పరిపాలన విధానాలు కలిసి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టాయని, అదే సీఎం జగన్ సక్సెస్ సీక్రెట్ అని హైదరాబాద్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ. వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న నిజమైన చాలెంజ్ ఎన్నికలు కాదని, సంక్షేమ పథకాల అమలుకు నిధులు సమకూర్చడమని ఆయన విశ్లేషించారు.