
‘‘జగనయ్యా.. నేను బతికే ఉండా సామీ..! ఇంకా తిరగతానే ఉండా. ఆ భగవంతుడు ఇంకా నన్ను పిలవలేదయ్యా. కానీ, ఈ ఆఫీసర్లు మాత్రం ‘నువ్వెప్పుడో సచ్చిపొయినావు’ అంటున్నారు. పదినెల్లుగా రేషను లేదు. నేను దెయ్యంకాదు మనిషినే. మీరు రేషనియ్యకపోతే నిజంగానే చచ్చిపోతా…’’ ఇది.. కాటికి కాళ్లు చాపిన ఓ వృద్ధురాలి దీనావస్థ. ఏపీలోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ మహేశ్వరపురానికి చెందిన టి.చిన్నక్క వయసు 90. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛనుతో కాలం వెళ్లదీస్తోంది. ఇప్పుడు ఆమె చనిపోయినట్లు అధికారులు రికార్డుల్లోకి ఎక్కించేశారు. దీంతో.. వస్తున్న రేషన్ కాస్తా ఆగిపోయింది. ‘నేను ఇంకా బతికే ఉన్నాను సామీ’ అంటూ అధికారుల చుట్టూ తిరిగితే.. పింఛను మాత్రం ఇస్తున్నారు. అది కూడా వచ్చే నెల నుంచి ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాక ఆ ముసలమ్మ.. తన గోడును మీడియా ద్వారా జగన్ కు వెళ్లబోసుకుంది.
‘‘నేను బతికే ఉన్నట్లు గవర్నమెంటు ఆఫీసుకు వెళ్లి సర్టిఫికెట్ తేవాలంట. ముసల్దాన్ని.. ఈ వయసులో ఎక్కడికి పోవాలి? ఎక్కడెక్కడ తిరగాలి? ఎవర్ని బతిమాలుకోవాలి? బతికే ఉన్నట్టు కనిపిస్తున్నాను కదా…’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. బతికే ఉన్న తాను చనిపోయినట్లు రాసుకున్న వాళ్లెవరో కనిబెట్టి, వాళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎంను వేడుకుంటోంది.
ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. ఆమె చనిపోయినట్లు రికార్డుల్లో ఉందని, అయినా తాము మానవతా దృక్ఫథంతో ఆమెకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే.. తమ ఉద్యోగాలకే ప్రమాదమని, అందుకే వచ్చే నెల నుంచి పింఛను ఆపేస్తున్నామని వివరించారు. దీంతో, సీఎం జగనే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు కోరుతోంది.