
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తాజ్ హోటల్ కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాఫ్టర్ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణభారతి ట్రస్టు , ముప్పవరపు ఫౌండేషన్ల కు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్టు 20 వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటలుకు చేరుకుంటారు. అదే హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్ హోటల్లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40 కు ఢిల్లీ చేరుకుంటారు.
అమిత్షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా కేంద్ర హోం మంత్రి సూచనలు చేయనున్నారు. బెంగుళూరులో జరిగిన 28వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలను 5 జోనల్ కౌన్సిళ్లుగా విభజించి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, ముఖ్య అధికారులు హాజరవుతారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలే ఏడున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య రూ.1,500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది. స్టాండింగ్ కమిటీ రూపొందించిన సమావేశం ఎజెండాలో మాత్రం.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోం శాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా చట్టాన్ని సవరించాలని అక్టోబరు 20న రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలిపారు.
మరోవైపు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఖరారు అయింది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఇవాళ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరుతారు. రాత్రి 7 గంటల సమయంలో రేణిగుంట ఎయిర్పోర్ట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్వాగతం పలుకనున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి సీఎం జగన్ తిరుమలకు బయలు దేరి వెళ్లనున్నారు. శనివారం రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరుతారు ముఖ్యమంత్రి. నవంబర్ 14 షెడ్యూల్ కూడా విడుదల ఖరారు అయింది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం లో సీఎం జగన్ పాల్గొం టారు. ఈ విషయంపై సీఎం క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసినది.