
ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. రోడ్ల మరమ్మతులకు రుణం దొరికింది. రోడ్లు, భవనాల శాఖ ఏడు నెలల కృషి ఫలించింది. రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు బోర్డులో తీర్మానం చేసింది. వడ్డీ 7.35 శాతం. రుణ కాల వ్యవధి 11 ఏళ్లు. అందులోనూ ఓ ఏడాది మారటోరియం. ఏపీ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు బ్యాంకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే, రుణం ఒప్పందం ఖరారు ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రుణం చేతికి రాబోతున్న నేపథ్యంలో.. అధికారులను మరో సమస్య వేధిస్తోంది. రోడ్ల మరమ్మతు పనులకు కాంట్రాక్టర్లతో ఎలాగైనా టెండర్లు వేయించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. వారిని ఆకట్టుకునే చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. రుణం మంజూరైందని, ప్రభుత్వం దగ్గర నిధులు సిద్ధంగా ఉన్నాయని కాంట్రాక్టర్లకు తెలియజేసేందుకు యత్నిస్తున్నారు. కానీ, కాంట్రాక్టర్లు మాత్రం తమ బకాయిలు చెల్లిస్తేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని తేల్చిచెబుతున్నారు.
రాష్ట్రంలో రోడ్లు దారుణంగా తయారవడంతో.. వాటిని బాగు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం తొమ్మిదివేల కిలోమీటర్ల మేర రోడ్లను మరమ్మతు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం 2 వేల కోట్లు రుణం తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం.. రోడ్లు భవనాల శాఖకు సూచించింది. ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదని, సొంత ప్రయత్నాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ దిశగా చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రుణాలు ఇవ్వడం కుదరదని తేలిపోయింది. దీంతో పెట్రోలు, డీజిల్ పై వసూలు చేస్తున్న సెస్సులో 50 శాతం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వానికి వచ్చే సెస్సులో సగం నేరుగా బ్యాంకులకు చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. అనేక ప్రయత్నాల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.