
శారదా పీఠానికి 15 ఎకరాల భూమి అప్పగించేందుకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు గుప్పుమంటున్నాయి. విలువైన భూములను అప్పగించబోతున్నారన్న ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే కొత్తవలసలో 15 ఎకరాలు అప్పగించేందుకు వీలుగా రూపొందించిన ఫైల్ ను మంత్రి మండలి యథాతథంగా ఆమోదించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రైతులకు 9 గంటల పాటు పగటి పూట ఉచిత విద్యుత్తు అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలకు ఓకే చెప్పారు.
2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనను ఆమోదించారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 5చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్టుల ఏర్పాటుకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.