
ఏపీలో పలు నగరపాలక, పురపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. 8 గంటలకు మొదలైన ఈ లెక్కింపులో.. 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ముఖ్యంగా కుప్పంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఇక్కడ మొత్తం 25 వార్డులుండగా.. 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవమైంది. తొలి నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో.. ఇప్పటి వరకు వేరే పార్టీ గెలిచిన దాఖలా లేదు. రాష్ట్రంలో చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని చూస్తున్న వైసీపీ.. ఎలాగైనా కుప్పం మునిసిపాలిటీని గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇక్కడ పోలింగ్ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లు భారీగా వచ్చారు. అన్ని పోలింగ్ బూత్ లలోనూ వాళ్ల హవానే కనిపించింది. కొన్ని చోట్ల ప్రజలే వాళ్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. మరికొన్ని చోట్ల దొంగ ఓటర్లను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ నేపథ్యంలో.. ఈ దొంగ ఓట్ల ప్రవాహాన్ని ఎదురొడ్డి నిలిచి మరీ టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారా? లేదా.. అధికార వైసీపీ చరిత్ర సృష్టిస్తుందా? మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
కాగా, నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. మంత్రి అనిల్.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అటు కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట పురపాలిక ఓట్ల లెక్కింపు మొదలైంది.