
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత బొండా ఉమ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే శ్రీనివాసుడి విలువైన ఆస్తులు, కానుకలైనా ఉన్నాయా? లేక మాయమయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. జంబో బోర్డును రద్దు చేస్తూ హై కోర్టు వెలువరించిన తీర్పు సర్కార్ కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. వైసీపీ పాలనలో టీటీడీ భ్రష్టు పట్టిందని విమర్శించారు. దేవస్థానం బోర్డును ఆదాయ వనరుగా మార్చుకోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 52 మందికి పదవులను అమ్ముకున్నారని అన్నారు. క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లను బోర్డు ఆహ్వానితులను బోర్డులో చేర్చిందని మండిపడ్డారు. భక్తులు సమర్పించిన తలనీలాలను కూడా వైసీపీ నేతలు విదేశాలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.