
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ఎత్తి వేయించడానికి సీఎం జగన్ కుట్ర పన్నారని, అందుకే, ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వచ్చిన సమయంలోనే వైసీపీ నేతలను కూడా పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తాలిబన్లు మాదిరి పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు పోలీసుల చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతో ఎప్పుడూ ఇలాంటి పనులు చేయించలేదని అన్నారు. అధికార పార్టీ నేతలు ఏకంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులకు తెగబడుతున్నారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆనందబాబు ప్రశ్నించారు.