
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ను దేశంలోనే బెస్ట్ సీఎం అని గతేడాది 11 శాతం మంది ప్రజలు అభిప్రాయ పడితే, ఈ ఏడాది ఆ సంఖ్య కేవలం ఆరు శాతానికి పడిపోయింది. దీంతో సీఎం జగన్ గ్రాఫ్ సగానికి సగం పతనమైంది. టాప్ టెన్ సీఎంల లిస్ట్‌లో సీఎం జగన్ పేరు ఏడాది తిరగకుండానే అడ్రస్ లేకుండా పోయింది. ఇండియాలో బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ కు చోటు దక్కలేదు. ఏడాది క్రితం ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టాప్ టెన్ సీఎంల లిస్టులో ప్లేసు దక్కించుకున్న జగన్ ఈ ఏడాది అదే సంస్థ నిర్వహించిన బెస్ట్ సీఎంల జాబితాలో పత్తా లేకుండా పోయారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్‌కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లకు బెస్ట్ సీఎంల జాబితాలో స్థానం దక్కింది.
సీఎం కావాలనే ఏకైక లక్ష్యంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని చేసిన పాదయాత్ర ప్రజల్లో ఆయన పట్ల అభిమానాన్ని పెంచింది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు కదా, ఒక్క ఛాన్స్ అడుగుతున్న యువకుడికి కూడా అవకాశం ఇచ్చి చూద్దామనే ధోరణిలో రాష్ట్ర ప్రజలు జగన్ కు ఊహించని ఘన విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోనే అనుకున్నదొక్కటి … అయినది మరొక్కటని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్‌పై తాముంచిన నమ్మకం, విశ్వాసం తలకిందులయ్యాయని గ్రహించారు. జగన్ మూర్ఖపు పట్టుదలతో పాటు ఆయన మంత్రి మండలి, సలహా మండలి కూడా ప్రజల ఆలోచనలో మార్పు రావడానికి కారణం.
ప్రజలకు మేలు చేసి వారికి దగ్గరై మంచి పేరు తెచ్చుకోవాలనే ధ్యాస రాష్ట్ర మంత్రులకు తక్కువ. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలపై నోరు పారేసుకోవడం ఎక్కువ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ నోరెత్తకుండా, క్యాంప్ ఆఫీసు కుర్చీలో కదలకుండా కూర్చొని ఉండగా, ఆయన మంత్రులు నోటికి పని చెప్పి రోజులు గడిపేస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబు .. చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దది అవుతంది. ఎదురుదాడి పేరుతో ప్రతిపక్షనేతలను నోటికి వచ్చినట్లు తిట్టడం, కొంతమంది హద్దుమీరి బూతులు మాట్లాడటం సర్వసాధారణంగా మారింది. ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చడానికి, అక్రమాలను, అప్పులను దాచి పెట్టడానికి మంత్రులు బూతులు అడ్డం పెట్టుకుని రోజులు నెట్టుకు వస్తున్నారు. ప్రసార మాధ్యమాల సాక్షిగా మంత్రుల బూతుల భాగోతాన్ని కళ్ళారా చూస్తున్న రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపైన భ్రమలు తొలగిపోయాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సీఎం జగన్ ఇమేజ్ను దారుణంగా డ్యామేజ్ చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేక పోవడం, అప్పుల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీలో కేంద్ర పెద్దలను ప్రాధేయపడడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అమ్మో ఒకటో తారీఖని భయపడుతున్న ప్రభుత్వాన్ని చూసి జగన్ వీరాభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. అనుభవరాహిత్యం, ఆర్థిక క్రమశిక్షణ లేక పోవడంతో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనే భావన యువతలో వేళ్లూనుకుపోయింది. జగన్ ప్రధాన సలహాదారుల సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసక బార్చిందని ఏపీలో పబ్లిక్ టాక్. కరోనా ఏడాది ప్రజల నుంచి బెస్ట్ సీఎం అనిపించుకున్న జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వరస్ట్ సీఎంగా ముద్ర పడ్డారు. మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలోనే ఉండడం కూడా వైసీపీ ప్రభుత్వానికి మైనస్ మార్కులు పడేందుకు కారణమైంది. ఇసుక, మైనింగ్ అక్రమాలు, శాంతి భద్రతల వైఫల్యం, పెట్రోల్ బాదుడు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పించన్ల చెల్లింపుల్లో జాప్యం వంటి అనేక అంశాలు జగన్‌ను జనానికి దూరం చేశాయి. ఇప్పటికైనా జగన్ మేలుకుని పరిస్థితి చెయ్యి దాటకముందే చక్కదిద్దుకుంటే, కనీసం వచ్చే ఏడాదికైనా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశముంది. లేనిపక్షంలో మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవడానికి జగన్ సిద్ధం కావల్సిందే.