
మహిళా సర్పంచ్లకు బదులుగా భర్త, కుటుంబసభ్యులు, బంధువులు పంచాయతీరాజ్ శాఖ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఇకపై అధికారిక సమావేశాల్లో, కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు పాల్గొనడానికి వీల్లేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో ఎన్నికైన మహిళల భర్తలు, భార్యలకు బదులుగా తామే ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం,. భార్య పదవిని అడ్డం పెట్టుకుని మీటింగులకు హాజరవడంపై పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులు అధికారిక సమావేశాల్లో గానీ, కార్యక్రమాల్లో గానీ, పాల్గొనడానికి వీల్లేదని, హద్దుమీరి ఎవరైనా పాల్గొంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారిక సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు బదులుగా భార్య, భర్త, కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొంటున్నారని పంచాయతీరాజ్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి నిర్ణయాలు కూడా వారే తీసుకుంటున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులు అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిస్తే, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, డీపీవో, జెడ్పీటీసీ ఈవోలపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని, ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.